శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాంగ్రెస్ యోగి.... ధీరేంద్ర బ్రహ్మచారి

>> Tuesday, March 28, 2017

కాంగ్రెస్ యోగి.... ధీరేంద్ర బ్రహ్మచారి 
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికోసమే ఈ పోస్ట్ . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. నిజం చెప్పాలంటే , ఇప్పటికన్నా అప్పుడే చాలా ఎక్కువగా ఉండింది. దాని గురించి ఈతరం వారికి తెలియజెప్పటమే ఈ పోస్ట్ ముఖ్యోద్దేశ్యం.
ఇది ఒక యోగి జీవిత కథ. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఒక బ్రహ్మచారి కథ. తారాజువ్వలా నింగికి ఎగసి నేలరాలిన ధీరేంద్ర బ్రహ్మచారి కథ. ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీ ని, మొత్తం గాంధీ పరివారాన్ని నడిపించిన ఒక రాజగురువు కథ. ఆద్యంతం మలుపులతో, సినీ ఫక్కీలో నడిచిన ఈ యోగి జీవిత కథ ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరీ బ్రహ్మచారి? మా తరం, మాకన్నా ముందు తరం వారికి తెలిసిన కథే. కానీ, భారత భవిష్యత్తును నిర్దేశించే  నవతరానికి ఈ కథ తెలియాల్సిందే.
13 వ ఏటే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిన ఒక కుర్రాడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కట్టుబట్టలతో బయటికి వచ్చిన వాడు వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీకి రాజగురువు ఎలా అయ్యాడు? ఎవరి మాటా వినడని ప్రఖ్యాతి చెందిన సంజయ్ గాంధీని ఎలా మచ్చిక చేసుకున్నాడు? ఇప్పటికీ మిస్టరీ వీడని విమాన ప్రమాదంలో ఎలా మరణించాడు? ఇవన్నీ ఆద్యంతం ఆసక్తికరం.
బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా సాయిత్ చాన్పూర్ గ్రామంలో 1924 ఫిబ్రవరి 24 వ తేదీన పుట్టాడని కొందరు,1925 లో పుట్టాడని కొందరు చెప్తారు. అలాగే అతని అసలు పేరు దిరేంద్ర చౌదరి అనీ,తండ్రి పేరు భంభోల్ చౌదరి అని కొందరు కాదు..కాదు అతని పేరు దిరేంద్రశర్మ అని కొందరు చెప్తారు. నిజమేమిటో ఇప్పటికీ తెలియదు. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1954 లో మాత్రమే. కలకత్తాలో ప్రజలను పరిచయం చేసుకున్నపుడు ఆయన చెప్పిన వివరాలు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. 'సన్యాసులకు సొంత ఊరూ ,పేరూ ఉండవు. కాబట్టి ఊరేదని అడగొద్దు. 13 వ ఏట భగవద్గీత ఇచ్చిన స్పూర్తితో ఇల్లు వదిలి వారణాసి వెళ్లి సన్యాసిగా మారాను. లక్నో కు సమీపంలో ఉన్న గోపాల్ ఖేరా ఆశ్రమంలో కార్తికేయ మహర్షి ఆశ్రమంలో చేరాను. ఆ మహర్షి 325 ఏళ్ళు జీవించి 1953 లో మరణించారు. వారు జీవించి ఉండగా అతిప్రాచీన భారతీయ యోగవిద్యను సాధన చేశారు. ఆ విద్య భారత్ లో అంతరించి పోయింది. కేవలం టిబెట్ లో మాత్రమే మిగిలి ఉంది దాన్ని మళ్ళీ బతికించి భారత ప్రజలకు అందించాలనేది.వారి కోరిక. వారి వద్ద నేను నేర్చుకున్న విద్యను కలకత్తా ప్రజలకు నేర్పించెందుకే వచ్చాను. నా వయసు నిజానికి చాలా పెద్దది. కానీ చూడ్డానికి యువకుడిలా కన్పిస్తాను. దానికి నేను సాధన చేస్తున్న యోగ,సూక్ష్మ వ్యాయమాలే కారణం.' ఇలా తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన దిరేంద్ర తనను తాను నిర్వచించుకున్నాడు. నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహు,కాంతులీనే మేనిఛాయ,అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. ఎలా తిప్పితే అలా తిరిగే దేహం ,వాటికి తోడూ అద్భుతమైన యోగ విన్యాసాలు. ప్రకృతి వైద్యం అదనపు ఆకర్షణలు. ఇవన్నీ చూసిన స్థానికులు ఆయనను ఆదరించారు.
చిన్న అద్దె ఇంటిలో మొదలైన జీవితం అతికొద్ది కాలంలోనే ఖరీదైన భోగవంతమైన ఆశ్రమానికి మారింది. నగరంలోని ప్రముఖులు,ముఖ్యంగాసంపన్న కుటుంబాల మహిళలు అతని శిష్యులయ్యారు.పాపులారిటీ, సంపాదనా పెరిగాయి. అక్కడి నుంచే అతని మహర్దశ మొదలైంది.
యోగాసనాలు వేయటంలో ఇప్పటి రాందేవ్ బాబాను మించిన వాడు. తాను యోగా చేస్తుండగా తీసిన ఫోటోలు, వాటి వివరాలతో 'సూక్ష్మ వ్యాయాం అండ్ యోగాసన' అనే పుస్తకాన్ని రూపొందించాడు. అప్పుడే జయప్రకాశ్ నారాయణ కలకత్తా వచ్చారు. మిత్రుల సహకారంతో ఆయనను కలిసి తన పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. ఆ పుస్తకం బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత అక్కడి సైనికులకు,సైనికాధికారులకు యోగా శిక్షణ ఇచ్చాడు. క్రమంగా అతని కీర్తి పెరుగ సాగింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ మీద కన్ను పడింది. అక్కడ ఒక చిన్నపాటి బ్రాంచ్ మొదలు పెట్టాడు. ఢిల్లీ చేరిన తర్వాత అతని దశ తిరిగిపోయింది. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని దిరెంద్రను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి దిరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. నెహ్రు మరణాంతరం ఇందిరకు మరింత చేరువ అయ్యాడు.గురువు,సచివుడు ,హితుడు,సన్నిహితుడు అన్నీ తానే అయ్యాడు.
అక్కడినుంచి అతని ప్రభ వెలిగిపోయింది. అత్యంత ఖరీదైన ఆశ్రమాలు, యోగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రులు,బడా పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులు అతని శిష్యులుగా మారిపోయారు. అతని ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా మంజూరు అయ్యేవి.మరో వైపు ఆయుధ కర్మాగారంలో భాగస్వామి అయ్యాడు. ఆయుధాల వ్యాపారిగా, రక్షణ పరికరాల సరఫరా దారుగా ఎదిగాడు.ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో అతని ముద్ర స్పష్టంగా కన్పించేది. ఇక ఇందిరా తనయుడు సంజయ్ గాంధీకి దిరేంద్ర ఎంతచెప్తే అంతేగా ఉండేది. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ చేపట్టిన కుటుంబ నియంత్రణ, గుడిసెల నిర్మూలనా కార్యక్రమాలకు దిరేంద్ర బహిరంగ మద్దతు ప్రకటించాడు. ఇక్కడ ఇలా ఉండగా, రష్యా ఆహ్వానం మేరకు అక్కడి వ్యోమగాములకు యోగా శిక్షణ కూడా ఇచ్చి వచ్చాడు.
దిరేంద్ర కు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. విదేశాల నుంచి ఖరీదైన కార్లు,విమానాలు, ఎలెక్ట్రానిక్ పరికరాలు కానుకలుగా అందేవి. జమ్మూలో అతిపెద్ద ఆశ్రమం,సొంత విమానాశ్రయం,సొంత విమానం ,హెలికాప్టర్లు ఉండేవి. నిరంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు సొంత విమానాల్లో తిరిగేవాడు. దాంతో ఫ్లయింగ్ స్వామి గా సుప్రసిద్దుడయ్యాడు. సంజయ్ గాంధి మరణానికి కారణమైన విమానం కూడా దిరేంద్రదే కావటం విశేషం. సంజయ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ పరిపూర్ణంగా దిరేంద్ర పైనే ఆధార పడ్డారు. ఆయన సూచనలతోనే ఇందిరా అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో దిరేంద్ర ప్రమేయం చాలా ఎక్కువగా ఉండేది .
అప్పట్లో దూరదర్శన్ లో ప్రతీరోజు దిరేంద్ర యోగా కార్యక్రమాలు వచ్చేవి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువుగా విరాజిల్లాడు. అదే సమయంలో ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. కలకత్తా నుంచి ఢిల్లీ వరకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని వార్తలు గుప్పుమనేవి.అలాగే, ఎమర్జెన్సీ కాలంలో వేలకోట్ల అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు రావటం, జనతా ప్రభుత్వం నియమించిన షా కమీషన్ వాటిని నిర్ధారించటం, వాటిలో కొన్ని ఆస్థులను జప్తు చేయటం కూడా జరిగింది. ఇందిరా గాంధీ ,రాజీవ్ ల మరణం తర్వాత దిరేంద్ర పతనం మొదలయ్యింది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కున్నాడు. 1994 జూన్ 9 జమ్మూ పరిసరాల్లో ఆయన ప్రయాణిస్తున్న సొంత విమానం కూలిపోవటంతో ఆయన మరణించాడు. ఆ విమానం ఎలా కూలింది అనే విషయంలో మీడియా కానీ, అప్పటి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మరణం తర్వాత వారసులెవరూ లేకపోవటంతో ఆయన ఆశ్రమాలు,ఆస్థులు దోపిడీకి గురయ్యాయి.ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకునే వారే కరువయ్యారు.
యోగాసాధకుడిగా నిస్సందేహంగా దిరేంద్ర గొప్పవాడు. కానీ,రాజకీయ ప్రమేయాలు, ఆయుధాల వ్యాపారాలు,అక్రమాలు, మహిళలతో సంబంధాలు ఆయన లోని విద్వత్తును పూర్తిగా కనుమరుగు చేసేశాయి. యోగి భోగిగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో దిరేంద్ర జీవితమే ఒక ఉదాహరణ. అలాగే బెజేపీ హయాంలోనే యోగులు, సాధువుల రాజకీయ ప్రమేయం పెరిగిందని చెప్పటం కూడా అసత్యం. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఒక యోగి కనుసన్నల్లో ఎలా నడిచిందో చెప్పటానికి దిరేంద్ర బ్రహ్మచారి జీవితం ఒక చారిత్రక తార్కాణం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP