శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడంటే ఎవరు ? [మూడవభాగం]

>> Monday, December 16, 2013

[ ఈపోస్ట్ మొదటి రెండవభాగాలు ఇక్కడ చూడండి
 http://durgeswara.blogspot.in/2013/11/2.html]
 
మూడవభాగం
---------
 
 
"భగవంతుడు అఖండుడు.  కాబట్టి, సృష్టిలో ఏ భాగాన్ని గౌరవించినా, మొత్తం భగవంతుడిని గౌరవించినట్లే" - సుబ్రహ్మణ్యం గారు జవాబిచ్చారు. 

"అఖండుడు అంటే" - స్పష్టత కోసం సాయిరాం ప్రశ్నించాడు. 

"నువ్వున్నావు.  నీ కాలి మీద కత్తితో కోస్తే బాధ కలుగుతుందా లేదా? - కలుగుతుంది.  మరి చేతి మీద కొస్తే అప్పుడు కలుగుతుంది.  నీ దేహం మీద ఎక్కడ కోసినా బాధ కలుగుతుందని అంటే దేహమంతా కనెక్ట్ అయి ఉందన్న మాటేగా? అప్పుడు దేహం అఖండంగా ఉన్నదనే కదా! మరో సంగతికి వద్దాం.  నీ జుట్టుని కత్తిరిస్తే అంత బాధ ఉండకపోవచ్చు.  కానీ, ఎవడో వచ్చి, నీ సమ్మతి లేకుండా అడ్డదిడ్డంగా కత్తిరించి పోతే, నొప్పి లేదు కదా  ఊరుకుంటావా?"

"ఎందుకూరుకుంటాను? మనసు బాధ పడుతుంది కదా!"

"అంటే ప్రాణమున్న అవయవాలు, ప్రాణం లేని వెంట్రుకలు కూడా నీవయినప్పుడు, వాటిలో దేనిని గాయపరచినా, ఆ గాయం నీకు తగిలినట్లే అవుతోంది కదా!"

"అవును"

"అలాగే, సమస్త చరాచర సృష్టి అంతా కలిపి భగవంతుడి దేహం.   దానిలో సజీవము, నిర్జీవము అని తేడా ఏమీ లేదు.  నువ్వు ఒక రాతిని తీసుకుని, అది కూడా సృష్టి కర్తకు అతీతం కాదని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, అప్పుడే భగవంతుడు అఖండుడని కీర్తిస్తున్నావని అర్థం.  నీ జుట్టుని అందంగా కత్తిరించి, చక్కటి క్రాఫింగు ఇచ్చిన క్షురకుడిని నువ్వు  సత్కరిస్తావు.   అలాగే, రాతికి చక్కని రూపమిచ్చి, దానిలో దివ్యత్వాన్ని, దేవుడి గొప్పదనాన్ని చదవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడే ఆ లిపి ద్వారా, ఆయన మెప్పుని, అనుగ్రహాన్ని ఆహ్వానిస్తున్నావని అర్థం.  అలాగే ఆ శిల్పకళను, ఆగమాన్ని ఆరాధించడం ద్వారా కూడా.  దేవుడు అఖండుడు కాబట్టి, వాడి దేహంలోని భాగాలన్నీ పూజార్హాలే" - సుబ్రహ్మణ్యం గారు వాదించారు.
"ఆగండాగండి! భగవంతుడు అఖండుడని మీరు అనేస్తే సరిపోతుందా?  ఆ కొండలకి, ఈ చెట్లకి మధ్య కనెక్షన్ ఏమీ లేదు.  ప్రకృతి ఖండ ఖండాల మిశ్రమమే తప్ప, వేటి సమ్మేళనము కాదు.  గుంపే తప్ప, ఏకాండి వస్తువు కాదు.  కాబట్టి, అఖండమైన వాడే భగవంతుడు అనేదే మీ వాదన అయినప్పుడు, వాడు కూడా అసత్యమే అవుతున్నాడు" - సాయిరాం వాదించాడు.
"నాయనా సాయిరాం! క్లాసిఫికేషన్ లేదా వర్గీకరణ  నువ్వన్నావు గుర్తుందా? మరి సృష్టిని ద్రవ్యరాశి, శక్తి అని సైంటిస్టులు రెందు రకాలుగా గుర్తించారు కదా? అది సమగ్రమైన ఆలోచనేనా?"
"ఎందుకు కాదు? ద్రవ్యము, శక్తీ రెండింటిలో ఏదీ కాని దానిని మీరు ఊహించలేరు.  శక్తి, ద్రవ్యము కూడా వాస్తవంగా వేర్వేరు కావు.  శక్తిని కలిపి ముద్ద చేస్తేనే ద్రవ్యరాశిగా రూపుదిద్దుకుంది.  ఆ వర్గీకరణ కేవలం విభిన్న కోణాలను అర్థం చేసుకోవడానికే" సాయిరాం వివరించాడు.
"అలాగే అనుకుందాం! ఓ ఉదాహరణ తీసుకో! అయిదుగురు వ్యక్తులు గుర్రప్పందాలకు వెళ్ళారు.  ఏ, బి, సి, డి, ఇ అనే గుర్రాలలో తలొక దాని మీద వారు పందాలు కాశారు.  ఈ వైవిధ్యం ఎలా సంభవించింది?";

"చాలా సింపుల్! ఎవరి అంచనాలు వారివి"
"భలే! నలుగురు మిత్రులు వ్యాపారాలు ప్రారంభించారు.  నలుగురూ ఘోరంగా చితికి పోయారు.  ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు.  ఒకడు ఊరినుంచి పరారయ్యాడు.  ఒకడు ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని తిరిగి విజయం సాధించాడు.  ఒకడు వేరొకరి కింద ఉద్యోగంలో చేరి, నెమ్మదిగా బయట పడ్డాడు.  నలుగురూ నాలుగు రకాలుగా ఎందుకు ప్రవర్తించారంటావు?"
"అదేమన్న మాట? ఎవరి మనస్తత్వం వారిది."
"ఆ వైవిధ్యం పదార్థంలోదా? శక్తి లోదా అనేదే నా సందేహం.  ఉదాహరణకి పది మంది మిత్రులు పది వేర్వేరు గనుల నుంచి బొగ్గుల్ని తెచ్చి, నిప్పు ముట్టించారు.  అన్నీ కాలాయి.  కణకణలాడుతుండగా వాటి మీద నీళ్ళు పోశారు.  అన్నీ చల్లారాయి.  అన్నీ ఒకేలా స్పందించడం ఎలా సాధ్యమైంది? నలుగురు వ్యక్తులు నాలుగు రకాలుగా స్పందించడం సహజమన్నావు.  ఒకే భాషకు చెందిన వారైనా, వారి మధ్య కమ్యూనికేషన్ ఉన్నా వారంతా ఒకేలా స్పందించలేదు.  కానీ, వేర్వేరు కంపెనీల బొగ్గుల మధ్య ఏ కమ్యునికేషన్ లేకపోయినా, ఒకేలా స్పందించాయి.  మరి ఆ సహజత్వానికి భిన్నంగా ఇక్కడ ఈ వైవిధ్యం ఎలా సాధ్యమయింది? ఇది కూడా సహజత్వం ఎలా అయింది? దానికీ, దీనికీ తేడా ఎక్కడుంది? వాటి ద్రవ్యరాశిలోనా? శక్తి లోనా?"
"మీ ప్రశ్న కన్ఫ్యూజింగ్ గా ఉంది.  కాస్త విడమరచి చెప్పండి!"
"వాగ్దేవికి నా తెలుగు వ్యాసం ఒకటి ఇచ్చి DTP చేసి పెట్టమని అడిగాను.  తన కంప్యూటర్ లో ఇంగ్లీషు మాత్రమే ఉందంది.  సూర్యనారాయణ మూర్తి గారిని అడిగాను.  తెలుగు ఫాంట్స్ ఉన్నాయని చెప్పి DTP చేసి ఇచ్చారు.   రెండు కంప్యూటర్ల మధ్య ఉన్న తేడా ఆ కంపుటర్ ల ద్రవ్యరాశిలో ఉందా? వాటి శక్తుల మధ్యలో ఉందా?"
"వాటి సాఫ్ట్ వేర్ ల మధ్య తేడా అది. "
"అదే.  ఆ సాఫ్ట్ వేర్ ద్రవ్యరాశా, శక్తా?"
"ద్రవ్యరాశి కాదు.  శక్తి అని అనుకోవచ్చు.  అది ప్రాపర్టీ సార్.  లక్షణం.  లక్షణాల మధ్య తేడా లేకుండా ఎలా ఉంటుంది?"
"అదే స్వామి! ఆ లక్షణాలనేవి ద్రవ్యరాశి కిందకు వస్తాయా? శక్తి కిందకు వస్తాయా? ..... "
"ద్రవ్యానికీ లక్షణాలు ఉన్నప్పుడు, శక్తికీ లక్షణాలు ఉన్నప్పుడు, లక్షణం అనేది ద్రవ్యరాశి కిందకు గానీ, శక్తి కిందకు గానీ ఎలా వస్తుంది? అసమగ్రమైన వర్గీకరణ మానని సందిగ్దంలో పడేస్తుంది కదా!" 

సాయిరాం ఆలోచనలో పడ్డాడు.
సుబ్రమణ్యం గారే జవాబు చెప్పారు.  "ఆధునిక శాస్త్రజ్ఞులు సృష్టిని ద్రవ్యరాశి, శక్తి అనే రెండింటి సమ్మేళనంగా మాత్రమేచూశారు .  కానీ, మన భారతీయ శాస్త్రజ్ఞులు ప్రాచీన కాలంలోనే సృష్టిని పదార్థము + శక్తి + ప్రజ్ఞ అనే సమాహారంగా చూశారు.  దీని ప్రకారమైతే ఆ తేడాలన్నీ ఏ వర్గం కిందకు వస్తాయో నువ్వు చెప్పగలవు.  అది ప్రజ్ఞ అనే మూడో కేటగిరీ కిందకు వస్తుందన్నదే ఆ సమాధానం.  నిప్పు ముట్టితే చేతులు కాలాలన్నది బొగ్గులోని ప్రజ్ఞ.  ఇటు చేతులలోని ప్రజ్ఞ కూడా.  వాటిలో ప్రోగ్రామింగ్ అలా జరిగి ఉంది.  నీళ్ళు పడినప్పుడు ఆరిపోవాలనే ప్రజ్ఞ నిప్పులో ఉంది.  అదీ దానిలోనే ప్రోగ్రామింగ్ అయి ఉంది.  ఇలాంటి ప్రోగ్రామింగ్ ఏదీ లేకుండా సృష్టిలో ఏదైనా నీ ఊహ కందుతోందా? ఆకాశానికి ఒక ప్రజ్ఞ ఉంది.  నీరు, నిప్పు, గాలి, నేల అన్నింటికీ వాటి ప్రజ్ఞలు వాటికున్నాయి.  ఆఖరికి శూన్యానికి కూడా ఒక ప్రజ్ఞ ఉంది.  మనుషులకు వారి ప్రజ్ఞలు వారికున్నాయి.  కనిపించే దానిలో ప్రజ్ఞ లేదని చెప్పలేవు.  కనిపించని దానిలో అది లేదని కూడా చెప్పలేవు.  పదార్థము, శక్తీ పాలు నీళ్ళలా కలగలసి ఉన్నట్లే, ప్రజ్ఞ అన్నది అంతకన్నా ఎక్కువగా ఆ రెంటిలోనూ కలగలిసే ఉంది.  ప్రజ్ఞే దైవం అయినప్పుడు దేవుడు లేనిది ఏముంది? ఎక్కడుంది?"
"ప్రజ్ఞ అఖండం ఎలా అయింది? అది ఎక్కడికక్కడ తుంపులుగానే ఉంది?  ఆయా పదార్థాలను, శక్తినీ ఆవరించుకుని వాటికి పరిమితమై ఉంది"
"నాయనా సాయిరాం! పూసలు వేర్వేరుగా ఉన్నా దండలో దారం  ఉన్నట్లే, వస్తువులు విడి విడిగా కనిపించినా, ప్రజ్ఞల సమాహారం అఖండంగా ఉంది.  విడివిడిగా ఉన్నా, రోడ్డు ఒక్కటే.  రోడ్లు వేర్వేరుగా కనిపించినా భూమి ఒక్కటే.  అలాగే  నువ్వు, నేను, ఆ కీటకం, ఈ చెట్టు, ఈ రసాయనిక పదార్థాలు, ఈ నీళ్ళు, ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు, గ్రహాలూ అన్నీ మాంస నేత్రాలకు వేర్వేరుగా కనిపించినా సమస్తమూ ఒకే ఒక ప్రజ్ఞలో భాగం.  ఆ అనంతమైన ప్రజ్ఞే భగవంతుడు.  ఆయనను జ్ఞాపకం చేసే సంకేతాలే ఈ సృష్టిలోనివన్నీ" - సుబ్రమణ్యం గారు దేవుడంటే ఏమిటో సాయిరాం కు ఒక ఐడియా ఇవ్వగలిగారు. 
"కానీ సర్, నన్ను గిల్లితే ఆ నొప్పి మీకు తెలీదు.  మిమ్మల్ని గిల్లితే ఆ నొప్పి నాకూ తెలీదు.  మరి మన ప్రజ్ఞల మధ్య కనెక్షన్ లేదు.  కాబట్టి, ప్రకృతి లోని తుంపుల మధ్య అతుకు ఉందని చెప్పలేము.  ఉందని మీరంటున్నారే తప్ప నిరూపించ లేదు.  నిరూపించలేరు.  సృష్టి అఖండం కాదు" - సాయిరాం అభ్యంతరం చెప్పాడు.


(ఇంకా ఉంది     ............. )

[కె బి ఎన్ శర్మ గారిద్వారా లభ్యమైనది]

1 వ్యాఖ్యలు:

ballepalli srinivasarao December 18, 2013 at 8:08 AM  

adhubhutangaa cheppaaru. tamariki danyavaadaalu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP